
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మెరుగైన ఫలితాలు రాబడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగుల సంఖ్య ఆదివారం నాటికి 22,80,566కు పెరగడంతో రికవరీ రేటు 75 శాతానికి చేరువైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు మహమ్మారి బారినపడి మరణించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా 1.86 శాతానికి తగ్గడం సానుకూల పరిణమామని తెలిపింది. వ్యాధి నుంచి కోలుకునేవారి సంఖ్య నిలకడగా పెరుగుతుండటంతో మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 23.24 శాతానికి పరిమితమైందని తెలిపింది. చదవండి : సినిమా షూటింగ్‌లకు అనుమతి
గడిచిన 24 గంటల్లో 57,989 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 74.90 శాతానికి చేరిందని అధికారులు వెల్లడించారు. టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు సమగ్ర చికిత్సా విధానాలతో కోవిడ్-19 రోగులు అత్యధిక సంఖ్యలో కోలుకోవడంతో పాటు, మరణాల రేటు గణనీయంగా పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కట్టడికి భారత్ దశలవారీగా, చురుకైన వ్యూహాలతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 69,239 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మొత్తం కేసుల సంఖ్య 30,44,940కి ఎగబాకింది. వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో 912 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment