న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వరుసగా నాలుగో రోజూ శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆదివారం అత్యల్పంగా 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండేళ్లలో జనవరిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ తెలిపింది. హరియాణాలోని హిస్సార్‌లో 1.4 డిగ్రీలు, రాజస్తాన్‌లోని చురులో మైనస్ 0.5 డిగ్రీలు, పిలానీలో 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దేశ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు 480కి పైగా రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. 335 రైళ్లు ఆలస్యం కాగా, 88 రైళ్లను రద్దు చేసి, మరో 33 రైళ్ల ప్రయాణాలను కుదించినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పొగమంచు కారణంగా ఆదివారం ఉదయం 25 విమానాలు ఆలస్యంగా నడిచాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్వీట్ చేసింది. ప్రయాణికులు అప్‌డేట్ చేసే విమానాల రాకపోకల సమాచారాన్ని సరి చూసుకోవాలని కోరింది.
పొగమంచు కారణంగా పంజాబ్‌లోని భటిండా, యూపీలోని ఆగ్రాల్లో ఆదివారం దృగ్గోచరత 25 మీటర్లకు, అమృత్‌సర్, లూథియానా, వారణాసి తదితర నగరాల్లో 50 మీటర్లకు దృగ్గోచరత పడిపోయిందని ఐఎండీ పేర్కొంది. అతి శీతల వాతావరణం కారణంగా ఢిల్లీలో శుక్రవారం రికార్డు స్థాయిలో 5,526 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించారు. ప్రజలు సాధ్యమైనంత మేర ఇళ్లలోనే ఉండిపోవాలని ఐఎండీ సూచించింది. ఢిల్లీ సహా ఉత్తర భారతానికి ఐఎండీ ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment