న్యూఢిల్లీ: దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాలు తమ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయా దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాలని ఆకాంక్షించారు. కరోనా వ్యాప్తిని నియంత్రించే విషయంలో ఈ దేశాలన్నీ సహకరించుకున్నాయని హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ద్వీప దేశాల మధ్య అనుసంధానం పెరగకపోతే 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం కాబోదని తేల్చిచెప్పారు. 10 ఇరుగు పొరుగు దేశాలతో కలిసి ‘కోవిడ్–19 మేనేజ్‌మెంట్: ఎక్స్‌పీరియన్స్, గుడ్ ప్రాక్టీసెస్, వే ఫార్వర్డ్’ పేరిట గురువారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయా దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ఆన్‌లైన్‌లో మాట్లాడారు.
ప్రత్యేక వీసా పథకం తీసుకొద్దాం..
వర్క్‌షాప్‌లో మోదీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. దక్షిణాసియా దేశాలు ప్రత్యేక వీసా పథకాన్ని తీసుకురావాలని కోరారు. దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడానికి వీలుగా డాక్టర్లు, నర్సులు ఒక దేశం నుంచి మరో దేశానికి సులభంగా, వేగంగా ప్రయాణించేలా వీసాలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఎయిర్ అంబులెన్స్ ఒప్పందంపైనా దక్షిణాసియా దేశాల పౌర విమానయాన శాఖ మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్లు చూపుతున్న ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఉమ్మడిగా ఒక స్థానిక వేదికను సృష్టించుకుంటే బాగుంటుందని అన్నారు.
‘పరీక్ష పే చర్చ’ ఆన్‌లైన్‌లోనే..
సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో భయాందోళనలను దూరం చేయడానికి మోదీ ప్రతిఏటా ‘పరీక్ష పే చర్చ’ నిర్వహిస్తున్నారు. 9–12 తరగతుల విద్యార్థులతో మాట్లాడేవారు. కోవిడ్ కారణంగా ‘పరీక్ష పే చర్చ’ను ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. చర్చలో పాల్గొనేందుకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా పీపీసీ(పరీక్ష పే చర్చ) కిట్ ఇస్తారు.
విద్యుత్ సంస్కరణల్లో ముందడుగు
విద్యుత్ పంపిణీ, నియంత్రణ రంగాల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ రంగంలో ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డిస్కమ్‌లకు రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నామని వెల్లడించారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధుల సమర్ధ వినియోగానికి సంబంధించి గురువారం జరిగిన ఒక వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇతర నిత్యావసరాలను నచ్చినవారి నుంచి కొనుక్కునే వీలున్నట్లే.. విద్యుత్‌ను కూడా వినియోగదారులు తమకు నచ్చిన పంపిణీదారు నుంచి కొనుగోలు చేసుకునే వీలుండాలని ప్రధాని వ్యాఖ్యానించారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక రంగంగా పరిగణిస్తుందని, పరిశ్రమ రంగంలో భాగంగా చూడదని వివరించారు.
గత ఆరేళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్ధ్యం రెండున్నర రెట్లు, సౌర విద్యుదుత్పత్తి సామర్ధ్యం 15 రెట్లు పెరిగిందని వెల్లడించారు. 139 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సాధించి ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ఫ్రీక్వెన్సీ’లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. దేశీయ తయారీ కంపెనీలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నది తమ అభిమతమన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య నెలకొన్న విశ్వాసానికి ఈ వెబినార్ ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ‘పీఎం కుసుమ్’పథకం ద్వారా, రైతులు తమ క్షేత్రాల్లో చిన్న, చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా చూస్తామన్నారు. అలా, 30 గిగావాట్ల సౌర విద్యత్ ఉత్తత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment