కరోనా కష్టకాలంలో రిలయన్స్ ఫౌండేషన్ దేశంలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతు సాయం అందజేస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ కేరళ ప్రభుత్వానికి 2.5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందించింది. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రిలయన్స్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలపడటంతో పాటు ఈ సహాయం రాష్ట్ర వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని అన్నారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత ప్రభావవంతమైన మార్గం అని రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ తెలిపారు.
"మిషన్ వ్యాక్సిన్ సురక్షలో భాగంగా మేము దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్లను అందిస్తున్నాం. ఈ 2.5 లక్షల ఉచిత వ్యాక్సినేషన్ మోతాదులతో రిలయన్స్ ఫౌండేషన్ కేరళ వాసులకు తోడుగా నిలిచినట్లు" ఆమె అన్నారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్లను కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ కు అందజేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ జాఫర్ మాలిక్ కేరళ ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్లు అందుకున్నారు. ఈ వ్యాక్సిన్లను కేరళ ఆరోగ్య శాఖ ద్వారా పంపిణీ చేసి నిర్వహిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేరళ ప్రజలకు రిలయన్స్ ఫౌండేషన్ సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2018 వరదల సమయంలో, ఫౌండేషన్ సీఎం సహాయ నిధికి ₹21 కోట్లు విరాళంఇచ్చింది. వరద సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మందులు, నిత్యావసరాలు సరఫరా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment