ఢిల్లీ: ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు.
శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్‌కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్‌లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.
కాన్పూర్‌కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్‌లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు.
బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment