Russia-Ukraine crisis: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అంటారు. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపైన అలాగే పడుతుందన్న ఆందోళనలున్నాయి. ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా అన్ని దేశాలకూ కష్టనష్టాలు తప్పవు. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత పాటు రాబోయే రోజుల్లో సహజవాయువు దగ్గర్నుంచి గోధుమల వరకు అన్ని రకాల ధరలు పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► ఉక్రెయిన్‌లో దాదాపుగా 20 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మెడికల్ విద్యార్థులే. ఫార్మా, ఐటీ రంగ నిపుణులూ ఉన్నారు. ఇప్పుడు వారి భద్రతపై ఆందోళన నెలకొంది. వారిని వెనక్కి తీసుకురావడానికి భారత్ ప్రత్యేకంగా విమానాలు నడుపుతోంది.
► రష్యాపై ఆయుధాల కోసం మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. ఎస్–400 క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. అమెరికా రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ఒప్పందం రద్దు కోసం అగ్రరాజ్యం నుంచి మనపై కూడా ఒత్తిడి పెరుగుతుంది.
► ఈ ఉద్రిక్తతల్లో చైనా పాత్ర కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తోంది. 2020 జూన్‌లో గల్వాన్ ఘర్షణల తర్వాత చైనాతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. డ్రాగన్ దేశంతో రష్యాకి మంచి స్నేహబంధం ఉండడంతో పాటు అక్కడ ప్రభుత్వంలో పరపతి కూడా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పుతిన్ ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేయలేక, ఉక్రెయిన్‌కి మద్దతునిచ్చే పరిస్థితి లేక ఎటూ మొగ్గు చూపించకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
► 2014 నుంచి చమురు ధరలు కనీవినీ రీతిలో పెరిగిపోతున్నాయి. ముడి చమురు బారెల్ ధర 100 డాలర్లకి సమీపంలో ఉంది. యూరప్ దేశాలకు రష్యా నుంచే చమురు సరఫరా జరుగుతుంది. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలతో బారెల్ ధర 150 డాలర్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా భారత్‌లో పెట్రోల్ ధరలు లీటర్‌కి రూ.7–8 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. భారత్‌కి అవసరమైన చమురులో 85శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో చమురు దిగుమతుల వ్యయం తడిసిమోపెడు అవుతుంది.
► కరోనా సంక్షోభం ఆహార ధాన్యాల ఎగుమతి దిగుమతులపై తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. గోధుమల ఎగుమతిలో రష్యా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటే, ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ రెండు సమరానికి సై అనడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశాలున్నాయి.
► బీరు తయారీకి వాడే బార్లీ గింజలు అధికంగా ఉక్రెయిన్‌లో పండుతాయి. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బీరు కంపెనీలకూ ధరాభారం తప్పదు.
► వంట నూనె ధరలు కూడా మరింతగా పెరిగే చాన్స్ ఉంది. ప్రపంచ దేశాల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉన్నందున వాటి ధరలకి రెక్కలు రావచ్చు.
► రష్యాపై ఆంక్షల కారణంగా పలాడియమ్ లోహం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆటోమేటివ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్, మొబైల్ ఫోన్లలో దీనిని వాడతారు. దీంతో వీటి ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment