సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ | Sadhguru Undergoes Emergency Brain Surgery And Recovering Very Well, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Sadhguru Health Condition: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ

Published Wed, Mar 20 2024 6:31 PM | Last Updated on Wed, Mar 20 2024 7:01 PM

Sadhguru undergoes emergency Brain surgery And recovering - Sakshi

సద్గురు జగ్గీవాసుదేవ్‌కు తీవ్ర అస్వస్థత

ఢిల్లీ అపొలోలో బ్రెయిన్‌ సర్జరీ

న్యూఢిల్లీ: ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అనూహ్యంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్‌ నిర్వహించగా.. బ్రెయిన్‌లో కొంత తేడాను గమనించారు వైద్యులు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్‌ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. మార్చి 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బ్రెయిన్‌లో స్వెల్లింగ్‌ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంత మేర బ్లీడింగ్‌ను గుర్తించారు. ఢిల్లీ అపొలో ఆస్పత్రిలో డాక్టర్‌ వినీత్‌ సురీ నేతృత్వంలోని బృందం ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్‌ ఎక్కువగా కనిపించినట్టు తెలిసింది.

పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్‌ నిర్వహించినట్టు తెలిసింది. వైద్యబృందంలో డాక్టర్‌ వినీత్‌ సూరితో పాటు డాక్టర్‌ ప్రణవ్‌ కుమార్‌, డాక్టర్‌ సుధీర్‌ త్యాగి, డాక్టర్‌ ఎస్‌ ఛటర్జీ ఉన్నారు. ఆపరేషన్‌ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్‌ పారామీటర్లు మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కర్ణాటకలోని మైసూర్‌లో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన జగ్గీ వాసుదేవ్‌ నలుగురి సంతానంలో ఆఖరివాడు. సద్గురు తండ్రి రైల్వేశాఖలో కంటి డాక్టర్‌. 11ఏళ్లప్పుడు యోగా నేర్చుకున్న సద్గురు స్కూలు మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీషులో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. మోటార్‌ డ్రైవింగ్‌ అంటే ఎంతో ఇష్టపడే సద్గురు.. పాతికేళ్ల వయస్సులో మోటారు సైకిల్‌పై చాముండి కొండ పైకి వెళ్ళి ఓ ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెబుతారు. ఆ తర్వాత ధ్యానమార్గం పట్టి ఈషా ఫౌండేషన్‌ ప్రారంభించారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో సద్గురుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

1983లో  మైసూరులో మొదటి యోగా క్లాస్‌ను నిర్వహించాడు. 1989 లో కోయంబత్తూర్ లో ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేశాడు. కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిలో ఈ సెంటర్ నడుస్తోంది. 1999లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానలింగం ఏర్పాటు చేశారు. ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించామని, కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో 76 అడుగుల గోపురం, గర్భగుడిని నిర్మించామని సద్గురు చెబుతారు.  హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ ఓ సర్వధర్మ స్థంభాన్ని ఏర్పాటు చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement