సంభాల్ సివిల్ జడ్జి కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ప్రభుత్వానికి స్పష్టీకరణ
అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి సూచన
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ పట్టణంలోని షాహీ జామా మసీదు విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మసీదు కేసుతోపాటు సర్వే వ్యవహారంలో తదుపరి విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని సంభాల్ సివిల్ జడ్జి కోర్టును ఆదేశించింది. సంభాల్ టౌన్‌లో శాంతి సామరస్యాలను పరిరక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టంచేసింది.
1526లో మొఘల్ పాలకుడు బాబర్ హయాంలో ఆలయాన్ని కూల్చివేసి షాహీ జామా నిర్మించారని, సర్వే చేసి ఆలయం ఆనవాళ్లు గుర్తించాలని కోరుతూ కొందరు సంభాల్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మసీదులో సర్వే చేయాలంటూ ఈ నెల 19న ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే కొనసాగిస్తుండగా ఈ నెల 24న హింసాకాండ చోటుచేసుకుంది.
నలుగురు మరణించారు. సంభాల్ సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సంభాల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మసీదు సర్వేపై కోర్టు కమిషనర్ రూపొందించిన నివేదికను సీల్ చేయాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా తెరవకూడదని పేర్కొంది. సివిల్ జడ్జి కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి సూచించింది. ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చేవరకూ ట్రయల్ కోర్టు తదుపరి విచారణ చేపట్టడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ప్రశాంతంగా ముగిసిన ప్రార్థనలు
షాహీ జామా మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. సంభాల్ జిల్లాలోని ఇతర మసీదుల్లోనూ ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోలేదు. సంభాల్ పట్టణంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment