సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది.
మన్నార్‌కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు.
2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్‌పీఎస్‌సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది.
సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment