Group II posts
-
పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె.. కమిషనర్
సాక్షి, చెన్నై: తిరువారూర్ జిల్లాకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుమార్తె అదే జిల్లాలోని ఓ మునిసిపాలిటీకి కమిషనర్ అయ్యారు. తన తాత, తండ్రి పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగించగా, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గ్రూప్–2 ఉత్తీర్ణతతో తిరుత్తురైపూండి మునిసిపాలిటీ కమిషనర్‌గా దుర్గ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వివరాలు.. తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి పుదుపాలం గ్రామం సత్యమూర్తి నగర్ చెందిన శేఖర్, సెల్వి దంపతులకు దుర్గ ఏకైక కుమార్తె. శేఖర్ మన్నార్ కుడి కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసేవారు. తండ్రి పడే కష్టాన్ని చిన్నతనంలోనే ప్రత్యక్షంగా చూసిన దుర్గా ఏదో ఒక రోజు తాను ఉన్నత స్థితిలో నిలబడాలని ఆకాంక్షించింది. మన్నార్‌కుడి ప్రభుత్వ ఎయిడెడ్ బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్–2 వరకు చదవింది. ఆ తర్వాత అతి కష్టంతో మన్నార్ కుడి రాజగోపాల స్వామి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఎంతో కష్ట పడి తనను చదివించినా, చివరకు 2015లో మదురాంతకంకు చెందిన నిర్మల్ కుమార్‌తో అనూహ్యంగా వివాహం చేసేయడం ఆమెను కలవరంలో పడేసింది. అయితే, తండ్రి స్థానంలో భర్త నిర్మల్ ఆమెకు సహకారం అందించాడు. 2019 నుంచి పట్టువదలని విక్రమార్కుడి తరహాలో టీఎన్పీఎస్సీ పరీక్షలు దుర్గ రాస్తూ వచ్చింది. 2023 గ్రూప్ –2 లో మెరిట్ సాధించింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్వ్యూలలోనూ 30కు 30 మార్కులు సాధించారు. తొలుత పోలీసు విభాగంలో లోని స్పెషల్ బ్రాంచ్ సీఐడీలో పనిచేసే అవకాశం వచ్చినా, తన తండ్రి కారి్మకుడిగా పనిచేసిన మునిసిపాలిటీకి కమిషనర్ కావాలని తాపత్రయం పడింది. పరిస్థితులు అనుకూలించడంతో తిరువారూర్ జిల్లా పరిధిలోని మన్నార్‌కుడి మునిసిపాలిటికీ పొరుగున ఉన్న తిరుత్తురైపూండికి కమిషనర్ అయ్యే అవకాశం దక్కింది. సోమవారం సీఎం స్టాలిన్ నుంచి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న దుర్గా మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి పేరును కాపాడటమే కాకుండా, పారిశుద్ధ్య కార్మికులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకెళ్తానని దుర్గా పేర్కొన్నారు. అయితే, తన కుమార్తె కమిషనర్‌గా మునిసిపాలిటీలోకి అడుగు పెట్టినా, కనులారా చూసే భాగ్యం తండ్రి శేఖర్‌కు దక్కలేదు. గత ఏడాది అనారోగ్యంతో ఆయన మరణించడం గమనార్హం. -
జూలై మొదటి వారంలో గ్రూప్–2 ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఇంటర్వ్యూలను జూలై మొదటి వారంలో ప్రారంభిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇంటర్వ్యూల ప్రక్రియను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అలాగే ఉపాధ్యాయ నియామకాల ఎంపిక చేపట్టామని, ఆ జాబితాను విద్యాశాఖకు పంపించామని పేర్కొన్నారు. చక్రపాణి నేతృత్వంలోని కమిషన్ ప్రతినిధి బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2017–18 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఆయనకు అందజేసింది. టీఎస్పీఎస్సీ చేపడుతున్న సంస్కరణలపైనా గవర్నర్‌కు నివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీలో సిబ్బంది నియామకం, భవనాల కేటాయింపు వంటి అంశాలపై చర్చ జరిగింది. టీఎస్పీఎస్సీలో వార్షిక కేలండర్ అమలు, గ్రూప్–1 నోటిఫికేషన్ తదితర అంశాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రూప్–2 నియామకాలకు సంబంధించిన వివరాలపైనా ఆరా తీశారు. గ్రూప్–1కు సంబంధించి జోన్లవారీగా పోస్టుల విభజనకు సర్కారు కసరత్తు చేస్తోందని ఆయనకు వివరించినట్టు తెలిసింది. రెండు నెలలపాటు ఇంటర్వ్యూలు... ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేకుండా సమగ్రమైన పద్ధతిలో ఎప్పటికప్పుడు నియామకాలు పూర్తిచేస్తున్నందున టీఎస్పీఎస్సీని గవర్నర్ అభినందించారని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్–2లో 1,032 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైనవారి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా జాబితాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి, జూలై మొదటివారంలో ఇంటర్వ్యూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 2,064 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ పూర్తికావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. మొత్తం 39,659 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అందులో 3,186 పోస్టులకు ఆయా శాఖల నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. 128 గ్రూప్–2 పోస్టులు మినహా 36,474 పోస్టులను నోటిఫై చేశామని, అందులో 26,259 పోస్టులను భర్తీ చేసినట్లు వివరించారు. 3,494 పోస్టుల మెరిట్ æజాబితాలను విడుదల చేశామని, అవి సర్టిఫికెట్ల పరిశీలన వంటి వివిధ దశల్లో ఉన్నాయని చక్రపాణి తెలిపారు. గవర్నర్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో టీఎస్పీఎస్సీ సభ్యులు సి.విఠల్, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
నెలాఖరుకు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి మార్కాపురం: ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఇకపై ఏపీపీఎస్సీ ప్రతి ఏడాది క్యాలెండర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి రోస్టర్ విధానంలో భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 2011 మెయిన్స్ పరీక్ష జరుగుతోందని, త్వరలో ఫలితాలను ప్రకటించి, ఇంటర్వూ్యలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు. సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వెన్నా హనుమారెడ్డి, ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మీర్జా షంషీర్ అలీబేగ్‌లు పాల్గొన్నారు.