నెలాఖరుకు గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడి
మార్కాపురం: ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2లో 750, గ్రూప్ 3లో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.
ఇకపై ఏపీపీఎస్సీ ప్రతి ఏడాది క్యాలెండర్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించి రోస్టర్ విధానంలో భర్తీ చేస్తామన్నారు. ప్రస్తుతం 2011 మెయిన్స్ పరీక్ష జరుగుతోందని, త్వరలో ఫలితాలను ప్రకటించి, ఇంటర్వూ్యలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి ఏడాది పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పారు.
సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, వీహెచ్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వెన్నా హనుమారెడ్డి, ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మీర్జా షంషీర్ అలీబేగ్‌లు పాల్గొన్నారు.