సాక్షి ముంబై: శివసేన ఫైర్ బ్రాండ్ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు తర్వాత తరువాత టార్గెట్ ఎవరనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు ఊతం వచ్చింది. ముఖ్యంగా సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఒకరకంగా శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఓవైపు ఇప్పటికే ఏక్‌నాథ్ శిండే తిరుగుబాటుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడటం ఉద్దవ్ ఠాక్రేకు చిక్కులను తెచ్చిపెట్టింది. మరోవైపు రోజురోజుకీ శిండే వర్గానికి పెరుగుతున్న మద్దతు, ఉద్దవ్ ఠాక్రే మద్దతుగా ఉన్న శివసేన నాయకులపై ఈడీ దర్యాప్తులు ఉద్దవ్ ఠాక్రేకు తలనొప్పిగా మారాయి.
పార్టీని, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నడూలేని విధంగా ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఆదిత్య ఠాక్రే పలు ప్రాంతాల్లో పర్యటించి శివసేన పదాధికారులలో నూతన ఉత్తేజాన్ని నింపుతూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో సంజయ్ రావుత్ అరెస్టు కొంతమేర శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఆందోళనను రేకేత్తించేలా చేసిందని చెబుతున్నారు.
అరెస్టు అయిన సంజయ్ రౌత్ తాను ఎలాంటి బెదిరింపులకు లొంగనని, తాను పార్టీ వీడనని ప్రకటించడం, దీనికి తీడు అన్ని రోజులు ఒకేలాగా ఉండవంటూ ఉద్దవ్ ఠాక్రే మాట్లాడటం శివసేన కార్యకర్తలలో ఒకరకమైన ఉత్తేజాన్ని నింపేలా చేస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ తర్వాత ఈడీ టార్గెట్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడైన శివసేన నాయకుడు అనిల్ పరబ్ పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ నాయకులు కిరీట్ సోమయ్య పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు.
కేసుల భయంతోనే శిండే గూటికి..
మరోవైపు శిండే వర్గంలో చేరిన శివసేన తిరుగుబాటు నాయకులు కూడా కావచ్చని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో శిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఈడీ దర్యాప్తులు జరిపి చర్యలు తీసుకుంటుందా అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏక్‌నాథ్ శిండే తిరుగుబాటుకు మందు ఆయన వర్గంలో చేరిన కొందరిపై ఈడీ దర్యాప్తులు చేసింది. వీరిలో ప్రతాప్ సర్‌నాయిక్, అర్జున ఖోత్కర్, యవ్వంత్ జాదవ్, భావనా గావ్లీ తదితరులున్నారు. వీరిని కూడా గతంలో ఈడీ విచారించింది.
ముఖ్యంగా ప్రతాప్ సర్‌నాయక్‌కు చెందిన రూ. 11.35 కోట్లు విలువైన ఆస్తులను జప్తీ చేయగా యశ్వంత్ జాధవ్‌కు సంబంధించిన 40 ప్రాపర్టీలు జప్తీ చేశారు. వీటిలో ముంబై బైకలాలోని 26 ఫ్లాట్లున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఈడీ రాడార్‌పై ఉన్న నాయకులుగా ఉన్న వారిపై మళ్లీ చర్యలు ఉంటాయా లేదా క్లీన్ చీట్ ఇచ్చారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్ కార్యదర్శి అక్షయ్ పాటిల్ ఏర్పాటు చేసి బ్యానర్ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీ, బీజేపీలో చేరిన వారిపై కూడా ఈడీ, సీబీఐ చర్యలు కొనసాగుతాయా.? కొనసాగుతున్నాయని తెలిస్తే సమాచారం అందించి రూ. ఒక లక్ష బహుమతిని అందుకోవాలని బ్యానర్ ద్వారా ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర అంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment