ముంబై: మహారాష్ట రాజకీయాల్లో శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. ముంబైలోని ఓ హోటల్ ఆయనను కలిసి సుమారు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాగా పరస్పరం విమర్శల దాడికి దిగే బీజేపీ- శివసేన పార్టీ కీలక నేతలు ఇలా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్.. ఈ భేటీ వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నా పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్, ఫడ్నవిస్‌ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని, అందుకే ఆయనతో సమావేశమయ్యారని పేర్కొన్నారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా)
ఇక ఫడ్నవిస్ ఇందుకు సానుకూలంగా స్పందించారని, అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తర్వాత మాత్రమే తాను అందుబాటులో ఉంటానని చెప్పినట్లు వెల్లడించారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల తర్వాత తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం బీజేపీ దోస్తీకి కట్ చెప్పిన శివసేన, ఎన్సీపీ- కాంగ్రెస్‌తో జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఆనాటి నుంచి ఇరు వర్గాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కంగనా రనౌత్ పీఓకే వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్ రౌత్ బీజేపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment