ఢిల్లీ: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను సుప్రీం కోర్టు ధర్మాసనం సున్నితంగా మందలించింది. బిల్కిస్ బానో కేసులో దోషుల్లో ఒకరి తరపున లూథ్రా వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయగా.. జోక్యం చేసుకున్న బెంచ్ ‘కొంతమంది దోషులకు ఎక్కువ ప్రయోజనాలు’ ఉంటుంటాయని వ్యాఖ్యలు చేసింది.
గురువారం సుప్రీం కోర్టులో లూథ్రా వాదిస్తూ.. యావజ్జీవ శిక్ష పడినవారిలో పరివర్తన, పునరావాసం కోసం క్షమాభిక్ష ప్రసాదించడమనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్నదేనని, హేయమైన నేరం దృష్ట్యా అలా చేయడం కుదరదని బిల్కిస్‌బానో తదితరులు వాదించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నిర్ణయం వెలువడినందువల్ల ఇప్పుడు దానిని రద్దు చేయలేమని చెప్పారు. ఇంతలో బెంచ్ కలగజేసుకుని..
‘క్షమాభిక్ష విధానం గురించి మాకు తెలుసు. అది అందరూ ఆమోదించినదే. ఇక్కడ బాధితురాలు, ఇతరులు ప్రస్తుత కేసుకు దీనిని వర్తింపజేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసుల్లో వెలువడిన తీర్పులను న్యాయస్థానానికి సమర్పించడంలో మాత్రమే సహకరించండి’ అని తెలిపింది. ఇక లూథ్రా వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గుజరాత్ గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తులు కొందరి చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో వాళ్లందరికీ జీవిత ఖైదు పడింది. అయితే.. రెమిషన్ కింద పదకొండు మందిని గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి కిందటి ఏడాది విడుదల చేసింది. ఈ విడుదలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ప్రస్తుతం పిటిషన్‌ను విచారిస్తోంది. దోషుల్లో ఒకడైన రమేశ్ రూపాభాయ్ చందానా తరఫున లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. రెమిషన్‌పై దోషుల్ని విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీం పలుమార్లు వివరణ కోరగా.. కచ్చితమైన వివరాలతో కూడిన నివేదికను మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం అందించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment