ఢిల్లీ: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అంగీకరించి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని కోరింది.
కొత్త చట్టంపై స్టే కోరిన కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్ధమని తెలిపారు. ఈ చట్టంపై స్టే విధించాల్సిందిగా కోరారు. అయితే.. కేంద్రం వాదనలు వినకుండా స్టే విధించలేదమని తెలుపుతూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్ కాపీని కేంద్రం తరఫు న్యాయవాదికి అందజేయాల్సిందిగా ధర్మాసనం కోరింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్‌తో సహా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికల సంఘానికి నియామకాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సభ్యునితో కూడిన స్వతంత్య్ర ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు పాత్రను కేంద్రం తొలగించింది. సీఈసీలు, ఈసీలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం నుంచి సుప్రీంకోర్టును తప్పించింది.
ఇదీ చదవండి: బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం
Comments
Please login to add a commentAdd a comment