
సాక్షి, బెంగళూరు: దేశవ్యాప్తంగా హిజాబ్ వివాదం సంచలనంగా మారింది. హిజాబ్ అంశంపై కర్నాటకలో ఇప్పటికీ పలు వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కర్నాటకలోని శివమొగ్గలో సోమవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో అక్కడ స్కూల్స్ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉపాధ్యాయులు ముస‍్లిం విద్యార్థులను అడ్డుకొని హిజాబ్ ను తొలగించి వెళ్లాలని కోరారు.
దీంతో వారి విన్నపాన్ని విద్యార్థులు నిరాకరించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతుండటంతో వారిని అనుమతించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వారికి హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు రాయాలని సూచించారు. ఈ సూచనను సైతం 13 విద్యార్థులు నిరాకరిస్తూ పరీక్షలను బహిష్కరించారు. ఈ విషయం కాస్తా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అక్కడికి చేరుకొని పిల్లలను సపోర్ట్ చేశారు. అనంతరం హిజాబ్ లేకుండా తమ పిల్లలను పాఠశాలకు పంపించలేమని తేల్చి చెప్పి విద్యార్థులను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment