న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రారంభమైన 24 రోజుల నుంచి దేశవ్యాప్తంగా 60 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైరాలాజిస్టులు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నారు. ఎందుకంటే సహజంగా తయారయిన యాంటీబాడీలు.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అభివృద్ధి అయిన యాంటీబాడీల కంటే ఎక్కువ రోజులు.. ఎక్కువ సమర్థవంతంగా పని చేస్తాయని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా కేవలం 44 కోవిడ్ రీ ఇన్‌ఫెక్షన్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీని బట్టి సహజంగా తయారయిన యాంటీబాడీలు ఎక్కువ కాలం కొనసాగుతాయని తెలుస్తోంది. ఇక ఇన్‌ఫ్లుయేంజా వైరస్‌ను తీసుకుంటే ఇది ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుంది. దీని విషయంలో వ్యాక్సిన్ కన్నా శరీరంలో సహజంగా తయారయిన యాంటీబాడీలు ఇన్‌ఫ్లుయేంజా వైరస్‌ను ఎదుర్కొవడంలో ఎంతో మెరుగైన రోగనిరోధక శక్తిని కనబరుస్తాయి’’ అన్నారు. అంతేకాక ప్రస్తుతం దేశం హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువలో ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇస్తూ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకూడదని జయప్రకాశ్ హితవు పలికారు.
చదవండి: ‘2019, డిసెంబర్‌కు ముందు అక్కడ కరోనా లేదు’
Comments
Please login to add a commentAdd a comment