న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ అంశంలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతోంది. రికార్డు స్థాయిలో 28 రోజుల్లో దాదాపుగా 80 లక్షల మందికి టీకాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా టీకా రెండో డోసు కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమైంది. జనవరి 16న కరోనా తొలి విడత కార్యక్రమం మొదలైంది. ఆరోజున రెండు లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ వీకే పాల్ రెండో డోసు తీసుకున్నవారిలో ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల్లోగా రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా తీసుకోలేకపోతే ఆరువారాల్లోగా రెండో డోసు తీసుకోవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు. భారత్ ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ ఎక్కువగా వినియోగిస్తోంది. పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్ అత్యధిక మందికి ఇస్తోంది. ఇక దేశీయంగా భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నంత వరకు సరఫరా చేస్తోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా తొలి విడత 79,67,647 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్న వారిలో 97% మంది సంతృప్తిగా ఉన్నారు. వచ్చే నెల నుంచి మరికొన్ని కంపెనీల టీకాలు అందుబాటులోకి వస్తే, రోజుకి 10 లక్షల మందికి ఇచ్చేలా కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. కోవిడ్ నిబంధనల్ని పక్కాగా పాటిస్తూనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత అవసరమని రెండో డోసు తీసుకున్న మహిళా వైద్య కళాశాల డాక్టర్ మాథూర్ చెప్పారు.
కేసులు తగ్గుతున్నా జాగ్రత్తలు తప్పనిసరి
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అన్నారు. గత నాలుగు వారాలుగా కేసులు తక్కువగా నమోదైతే, రెండు వారాలుగా మరణాల రేట్ తగ్గిందన్నారు. కరోనా తగ్గిపోయిందని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలన్నారు. గత వారం రోజులకి ప్రపంచవ్యాప్తంగా 32 లక్షల కరోనా కేసులు నమోదైతే ఈ వారంలో 19 లక్షలు కేసులు నమోదయ్యాయని టెడ్రాస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment