
ఢిల్లీ: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్లు మాత్రం షాకిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన సీ. రాజగోపాలచారి మనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత సీఆర్ కేశవన్ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపించారు. ఈ లేఖలో కేశవన్ కీలక విషయాలను వెల్లడించారు. తనకు 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసే బాధ్యతలు ఇచ్చినందకు కాంగ్రెస్‌కు, సోనియా గాంధీకి కేశవన్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీలో ప్రతీ ఒక్కరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని లేఖలో చెప్పుకొచ్చారు.
ఇక, తాను 2001లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయాన్ని గుర్తుచేసిన కేశవన్.. దేశానికి సేవ చేయడానికే విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి పార్టీలో చేరినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం పార్టీలో ఇవ్వడం లేదని కేశవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ప్రస్తుతం విలువలు లేవని ఆరోపించారు. పార్టీని సేవ చేసినన్ని రోజులు తన ప్రయాణం సవాలుగా, ఆకర్షణీయంగా ఉందని చెప్పారు. అలాగే, తనకు.. శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. ఇదే సమయంలో తనకు వేరే పార్టీలో చేరే ఆలోచన ప్రస్తుతంలేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment