న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని రెండు దేశాలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. బలగాల ఉపసంహరణపై లోతైన, నిజాయితీతో కూడిన చర్చ జరిగిందని పేర్కొన్నాయి. అయితే, ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఈ చర్చల్లో ఎటువంటి కచ్చితమైన సానుకూల ఫలితం మాత్రం వెలువడలేదు. మిలటరీ, దౌత్య మార్గాల ద్వారా చర్చల ప్రక్రియను కొనసాగించాలని, సాధ్యమైనంత త్వరగా ఏకాభిప్రాయానికి రావాలని దాదాపు 12 గంటల పాటు జరిగిన చర్చల్లో నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపాయి. ఈ చర్చల్లో ఈ సంవత్సరం ఏప్రిల్ నాటి యథాతథ స్థితి నెలకొనేలా చూడాలని భారత్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ చర్చల్లో భారత ప్రతినిధులకు 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా ప్రతినిధులకు దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ డిస్ట్రిక్ట్ మేజర్ జనరల్ లియూ లిన్ సారథ్యం వహించారు.
‘లద్దాఖ్’ను అంగీకరించం
ఒకవైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే.. దుందుడుకు వ్యాఖ్యలు చేయడాన్ని చైనా కొనసాగిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా గుర్తించబోదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చైనా సరిహద్దుల్లో భారత్ రోడ్లు సహా మౌలిక వసతుల నిర్మాణం చేపట్టడం, భారీగా బలగాలను మోహరించడం.. ఈ మొత్తం వివాదానికి, ఘర్షణలకు మూల కారణమని ఆరోపించారు. ఉద్రిక్తతలు పెరిగే చర్యలేవీ చేపట్టకూడదని ఇరుదేశాలు అంగీకరించినప్పటికీ.. భారత్ సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతోందని, బలగాలను మోహరిస్తోందని ఆరోపించారు. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లు భారత్‌లో అంతర్భాగమని, వాటి గురించి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఇప్పటికే పలుమార్లు భారత్, చైనాను హెచ్చరించింది.
సానుకూలంగా చర్చలు.. కానీ
Published Wed, Oct 14 2020 4:08 AM | Last Updated on Wed, Oct 14 2020 4:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment