2024కి వీడ్కోలు పలుకుతూ, 2025కి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరాన మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన బాబాను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే షిర్డీ చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 31న రాత్రంతా బాబా ఆలయాన్ని తెరిచివుంచనున్నామని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలాసాహెబ్ తెలిపారు.
షిర్డీ సాయిబాబా సంస్థాన్ ప్రస్తుతం నాలుగు రోజులపాటు షిర్డీ మహోత్సవ్(Shirdi Mahotsav)ను నిర్వహిస్తోంది. దీనిలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణం, సాయి ధర్మశాల తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పండపాలను ఏర్పాటు చేశారు. దీనికితోడు దేశం నలుమూలల నుండి సుమారు 90 పల్లకీలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నాయి.
2025, నూతన సంవత్సరం వేళ భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 120 క్వింటాళ్ల బూందీ ప్రసాదం ప్యాకెట్లు, సుమారు 400 క్వింటాళ్ల మోతీచూర్ లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఆలయ సముదాయం, దర్శనం క్యూ, సాయి కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో భక్తులకు ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. మరోవైపు పోలీసు ఇన్‌స్పెక్టర్లు, క్విక్ యాక్షన్ టీమ్‌లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్(Bomb Disposal Squad)లు షిర్డీలో అణువణువునా పహారా కాస్తున్నాయి. ఆలయ ప్రాంగణం, సాయి ఆశ్రమం, ప్రసాదాలయం తదితర ప్రదేశాలలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అంబులెన్స్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.
డిసెంబరు 31న భక్తులకు రాత్రంతా దర్శనాలు కల్పించనున్నందున 31న రాత్రి 10 గంటలకు జరిగే హారతి జనవరి 1న ఉదయం 5.15 గంటలకు జరిగే హారతి కార్యక్రమాలను రద్దుచేశారు. కాగా ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు షిర్టీకి చేరుకున్నారు. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు బాబా దర్శనం కోసం క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.
ఇది కూడా చదవండి: New Year 2025: జనవరి ఒకటి.. ప్రపంచ జనాభా 809 కోట్లు.. టాప్‌లో భారత్
Comments
Please login to add a commentAdd a comment