ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్‌..పెను దుమారం | Shiv Sena Fires On BJP Over ED Notice To Sanjay Raut Wife | Sakshi
Sakshi News home page

ఈడీ ఆఫీసుకు బీజేపీ బ్యానర్‌.. వేడెక్కిన రాజకీయం

Published Tue, Dec 29 2020 1:55 PM | Last Updated on Tue, Dec 29 2020 1:58 PM

Shiv Sena Fires On BJP Over ED Notice To Sanjay Raut Wife - Sakshi

సాక్షి, ముంబై : మొన్నటి వరకు శివసేన, బీజేపీల మధ్య కొనసాగిన మాటల యుద్ధం ఇప్పుడు ఏకంగా బ్యానర్లు ప్రదర్శించుకునే వరకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేయడంతో శివసైనికులు సోమవారం ఈడీ కార్యాలయం ఎదుట ‘బీజేపీ ప్రదేశ్‌ కార్యాలయ్‌’ అని బ్యానర్‌ ఏర్పాటు చేశారు. శివసేన భవన్‌ ఎదుట భారీ సంఖ్యలో పోగైన మహిళలు ఈడీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. (సంజయ్‌ రౌత్‌ భార్యకు ఈడీ సమన్లు)

శివ సైనికుల ఆగ్రహం.. 
పీఎంసీ బ్యాంకు నగదు అక్రమ రవాణా కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రావుత్‌ భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో శివసైనికులు ఆగ్రహానికి గురయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకులపై ఈడీని ఉసిగోల్పుతోందని ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్‌ రావుత్‌ సోమవారం విలేకరుల సమావేశంలో బీజేపీపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొచ్చి మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుందని రావుత్‌ ఆరోపించారు. సంవత్సర కాలం నుంచి తమను బెదిరిస్తూ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అందుకు ఈడీ, సీబీఐ అ్రస్తాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు.

సంవత్సర కాలంలో రాష్ట్రంలో శరద్‌ పవార్, ప్రఫుల్‌ పటేల్, ఏక్‌నాథ్‌ ఖడ్సే, ప్రతాప్‌ సర్నాయిక్‌ తదితరులకు ఈడీ నుంచి నోటీసులు జారీ అయ్యాయని గుర్తు చేశారు. గత మూడు నెలల నుంచి బీజేపీ నాయకులు తరుచూ ఈడీ కార్యాలయానికి వెళుతున్నారని ఆరోపించారు. శివసేన, ఎన్సీపీలకు చెందిన 22 మంది ఎమ్మెల్యేల జాబితాను రౌత్‌ చూపించారు. వీరందరికీ నోటీసులు జారీ చేసి ఆ తరువాత అరెస్టు చేస్తామంటూ బెదిరించడమేగాకుండా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గత నెల రోజుల నుంచి ఈడీ అధికారులతో తాము సంప్రదిస్తున్నామని, వారికి అవసరైన సంబంధిత పత్రాలన్ని సమర్పించామని అన్నారు. 

మేం భయపడం.. మంత్రి ఆదిత్య ఠాక్రే 
సాక్షి, ముంబై: శివసేన ఎంపీ సంజయ్‌రావుత్‌ సతీమణి వర్షా రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీచేయడం రాజకీయ కక్ష్యతోనే జరిగి ఉంటుందని, మేం కేసులకు భయపడమని శివసేన ఎమ్మెల్యే, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. సోమవారం ఈడీ సమన్లపై ఆదిత్య విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్‌ 29న పీఎంసీ బ్యాంకు మనీలాండరింగ్‌ కేసులో ప్రశ్నించాలని వర్షా రావుత్‌కు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఆదిత్య మాట్లాడుతూ.. ‘మేం భయపడం, మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఈడీ సమన్లు రాజకీయ కక్ష్యలో భాగమే’ అని వ్యాఖ్యానించారు. ముంబైలోని ఫెడరల్‌ ఎజెన్సీ ముందు హాజరు కావాలని వర్షా రావుత్‌కు ఈడీ ఇప్పటికే మూడు నోటీసులు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆవిడ ఆరోగ్యం బాగాలేనందున విచారణకు హాజరుకాలేకపోయినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్‌లో పంజాబ్, మహారాష్ట్ర కార్పొరేషన్‌ (పీఎంసీ) బ్యాంకులో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. 

ఆధారాల్లేకుండా నోటీసులు జారీచేయరు
ఈడీ, సీబీఐ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా అనవసరంగా ఎవరికీ సమన్లు, నోటీసులు జారీ చేయరని స్వాభిమాని పార్టీ చీఫ్‌ నారాయణ్‌ రాణే అన్నారు. రావుత్‌ భార్య వర్షాకు ఈడీ సమన్లు జారీచేయడాని సమరి్థంచారు. అనవసరంగా ఒకరిపై ఆరోపనలు, ప్రత్యారోపనలు చేయడానికి బదులు నేరుగా ఈడీ అధికారుల ఎదుట హాజరై సంబంధిత పత్రాలు చూపించాలని హితవు పలికారు. రుజువులు లేకుండా ఈడీ ఎవరికి నోటీసులు జారీ చేయదని రావుత్‌పై నారాయణ్‌ ధ్వజమెత్తారు. వారి వద్ద రుజువులున్నాయి కాబట్టి నోటీసు జారీచేశారని, బీజేపీ వ్యక్తిగత పనులకు ఈడీని వాడుకోబోదని, కేంద్రం ఆ«దీనంలో సీబీఐ, ఈడీ ఉంటుందనే విషయం రౌత్‌కు తెలియదా అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement