ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్థిని | Shristi Goswami will take charge as Uttarakhand Chief Minister | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్థిని

Published Sat, Jan 23 2021 1:39 PM | Last Updated on Sat, Jan 23 2021 4:02 PM

Shristi Goswami will take charge as Uttarakhand Chief Minister - Sakshi

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా 20 ఏళ్లు కూడా నిండని ఓ యువతి బాధ్యతలు చేపట్టనుంది. అయితే ముఖ్యమంత్రిగా ఉండేది మాత్రం ఒక్కరోజే. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి ఆ యువతి విధులు నిర్వహించనుంది. ఎందుకంటే జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకోనుంది. ప్రతియేటా జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

అందులో భాగంగా రేపు జరగబోయే బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం కుర్చీలో బాలిక కూర్చోనుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంతకీ సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరో కాదు హరిద్వార్‌ జిల్లా దౌలత్‌పూర్‌ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామి. ఈమె బీఎస్సీ డిగ్రీ చదువుతోంది. ఉత్తరాఖండ్‌ బాలికల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఈ మేరకు సృష్టిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆదివారం ఉత్తరాఖండ్‌ వేసవి రాజధాని అయిన గైర్‌సెన్‌లో సృష్టి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై సమీక్ష నిర్వహించనుంది. 

ఆయుష్మాన్‌భవ, స్మార్ట్‌ సిటీ, పర్యాటకతో పాటు ఇతర శాఖల కార్యక్రమాలు, పథకాలపై అధికారులతో సీఎం హోదాలో సృష్టి చర్చించనుంది. ఈ సమీక్షకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని.. నివేదికలు రూపొందించి సమావేశానికి రావాలని ఈ మేరకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రేపు ఉత్తరాఖండ్‌లో నవ పాలన సాగనుంది. అయితే సృష్టి గోస్వామి 2018లో ఉత్తరాఖండ్‌ బాలల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించింది. 2009లో థాయిలాండ్‌లో జరిగిన బాలికల అంతర్జాతీయ లీడర్‌షిప్‌ కార్యక్రమానికి సృష్టి హాజరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement