Six Died With Love Issues In Karnataka - Sakshi
Sakshi News home page

పెళ్లి పీటలెక్కాల్సిన ప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరికి వేలాడుతూ..

Published Fri, Dec 23 2022 6:43 AM | Last Updated on Fri, Dec 23 2022 10:44 AM

six died with love issues in karnataka - Sakshi

ప్రేమ అనేది కొందరికి మోదాన్ని పంచితే, మరెంతోమందికి ఖేదాన్ని కలిగిస్తోంది. తరచూ సంభవిస్తున్న అమానుష సంఘటనలే ఇందుకు రుజువులు. తాజాగా రాష్ట్రంలో మూడుచోట్ల దారుణాలు చోటుచేసుకున్నాయి. పెళ్లి పీటలెక్కాల్సిన ప్రేమ జంట ఒకే చెట్టుకు ఉరికి వేలాడారు. కుమారుడు ప్రేమించిన యువతితో వెళ్లిపోగా, యువతి కుటుంబం వేధింపులను తట్టుకోలేక అతని తల్లి, అన్న వదినలు ఉరి వేసుకున్నారు. ఇక దావణగెరెలో తను మనసుపడ్డ యువతికి మరెవరితోనో పెళ్లవుతోందనే  ఈర్ష్యతో అమ్మాయిని రోడ్డు మీదే కసితీరా చంపాడో ప్రేమోన్మాది.  

సాక్షి, బెంగళూరు: చెట్టుకు ప్రేమ జంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి కారణం ఓ యువతి జోక్యం చేసుకోవడమే. ఈ ఘటన చిక్కమగళూరు తాలూకా మల్లందూరు సమీపంలోని కల్లుగుడ్డె గ్రామంలో జరిగింది. వివరాలు... కల్లుగుడ్డెకి చెందిన దర్శన్, హాసన్‌ జిల్లా సకలేశపుర తాలూకా హాన్‌బాళుకు చెందిన పూరి్వక ప్రేమించుకున్నారు. ఐదేళ్ల కిందట మంగళూరులో ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్న పూర్వికతో దర్శన్‌కు పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరి పెళ్లికి పెద్దలు కూడా అనుమతించారు. ఇంతలో ఒక యువతి తెరమీదకు వచ్చింది. ఈమెది కూడా దర్శన్‌ గ్రామమే. అతడు తనను ప్రేమించి గర్భవతిని చేశాడని నెలరోజుల కిందట మల్లందూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్శన్‌ను పిలిచి విచారించారు.

ఈ సంగతి పూర్వికకు తెలియటంతో దర్శన్‌ను నిలదీసింది. మూడు రోజుల క్రితం మంగళూరు నుంచి దర్శన్‌ ఊరికి వచ్చిన పూర్విక అతనితో మాట్లాడింది. తాము చనిపోతున్నామని తల్లిదండ్రులకు మొబైల్‌లో వాయిస్‌ సందేశాన్ని పంపి బుధవారం ఆల్దూరు సమీపంలోని గుల్షన్‌పేట వద్దనున్న సత్తిహళ్లిలో  చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరో యువతి కేసు పెట్టడం వల్ల తమకు ఇక పెళ్లి కాదేమోనన్న ఆందోళనతో ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని అనుమానాలున్నాయి. ఆల్దూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట విగతజీవులుగా మారడంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.  

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య 
ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన హావేరి తాలూకా అగడి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. అగడికి చెందిన భారతి కమడొళ్లి (40), ఆమె కొడుకు కిరణ్‌ (28), కోడలు సౌజన్య (20) ఉరి వేసుకొని తనువు చాలించారు. సౌజన్య, కిరణ్‌లకు మూడు నెలల క్రితమే  వివాహమైంది. అంతలోనే శవాలుగా మారారు. సమస్య ఏమిటంటే.. భారతి చిన్న కొడుకు అరుణ్‌ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల వారిద్దరూ ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబసభ్యులు అరుణ్‌ ఇంటికి వచ్చి నానా గొడవ చేసేవారు. ఇది తట్టుకోలేక ముగ్గురూ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హావేరి రూరల్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.  

ఉన్మాది చేతిలో యువతి దారుణ హత్య 
ప్రేమోన్మాది యువతిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఘటన దావణగెరె నగరంలోని పీజీ లేఔట్‌ చర్చి రోడ్డులో జరిగింది. వినోబా నగరకు చెందిన చాంద్‌ సుల్తానా (24) హతురాలు. వివరాలు... 8 నెలల క్రితం హరిహరకు చెందిన యువకునితో ఆమెకు నిశి్చతార్తం జరిగింది. హరిహరకు చెందిన సాదిక్‌ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని వెంట పడేవాడు. ఆమె ససేమిరా అనడంతో  హత్య చేయాలని నిర్ణయించాడు. గురువారం ఉదయం దావణగెరెకి వెళ్లాడు.

ఆమె చర్చి రోడ్డులో స్కూటర్‌పై వెళ్తుండగా మాట్లాడాలని సాదిక్‌ అడ్డగించాడు.  మాట్లాడుతూ ఉండగానే చాకు తీసి ఆమె గొంతులో పొడిచాడు. బాధితురాలు తీవ్ర గాయాలతో కుప్పకూలింది. హత్యోదంతం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. దుండగుడు అక్కడి నుంచి పరారై పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయంలో ఉన్న అతన్ని పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. హత్యాస్థలిని ఎస్పీ సీబీ రిష్యంత్‌ పరిశీలించారు. పీజె నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement