Son Lost His Mental Balance While Playing PUBG - Sakshi
Sakshi News home page

మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..

Published Sun, Aug 6 2023 7:31 AM | Last Updated on Sun, Aug 6 2023 11:10 AM

son lost his mental balance due to pubg game - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. 

సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి
ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్‌(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్‌(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్‌, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్‌ కూర్చుని ఉన్నాడు. 

ఆసుపత్రికి చేరుకునేలోగానే..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్‌ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 

తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి
ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్‌ మాట్లాడుతూ నిందితుడు అంకిత్‌ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్‌​ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

నిత్యం పబ్జీ గేమ్‌ ఆడుతూ..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్‌ ఆడుతుంటాడు. ఈ గేమ్‌ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్‌ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. 
ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement