ఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల పరీక్షా పత్రంలో వచ్చిన ఒక వివాదాస్పద వ్యాసం తీవ్ర దుమారం రేపింది. దాంతో దీన్ని ఉపసంహరిస్తున్నామని సీబీఎస్‌ఈ సోమవారం ప్రకటించింది. విద్యార్థులందరికీ ఈ ప్రశ్నకు సంబంధించి ఫుల్ మార్కులు ఇస్తామని పేర్కొంది. వ్యాసంలో అంశాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన బోర్డు, ఇది ఒక దురదృష్ట ఘటనగా అభివర్ణించింది. విద్యాభ్యాసనలో సమానత్వానికి, శ్రేష్టతకు సీబీఎస్‌ఈ కట్టుబడి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి ఇంగ్లిషు టర్మ్ 1 ప్రశ్నాపత్రంలోని ఒక వ్యాసంలో లైంగిక వివక్ష, తిరోగామి విశ్వాసాలను ప్రతిబింబించే అభిప్రాయాలున్నాయని శనివారం తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో వెంటనే సీబీఎస్‌ఈ అప్రమత్తమైంది. ఈ వ్యాసంలో ‘‘ పిల్లలపై తల్లిదండ్రుల అధికారాన్ని స్త్రీ విముక్తి నాశనం చేసింది’’, ‘‘భర్త మార్గాన్ని అనుసరించడం ద్వారానే పిల్లల విధేయతను తల్లి పొందగలదు’’ అనే వాక్యాలున్నాయి. ‘‘స్త్రీ స్వాతంత్య్రం అనేక సామాజికార్థిక సమస్యలకు కారణమైంది, భర్తకు భార్య విధేయత చూపకపోవడంతో పిల్లల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగింది’’ అనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దీంతో సీబీఎస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ ‘ఇన్‌సల్ట్స్ ఉమెన్’ పేరిట హ్యాష్‌ట్యాగ్‌లు దర్శనమిచ్చాయి. బోర్డు స్త్రీద్వేష, తిరోగామి భావనలకు మద్దతినిస్తోందని పలువురు దుయ్యబట్టారు. దీంతో స్పందించిన బోర్డు సదరు వ్యాసం తమ ప్రశ్నాపత్రాల రూపకల్పనా నిబంధనలకు అనుగుణంగా లేదని, విద్యార్ధులకు పూర్తి మార్కులు కేటాయిస్తామని బోర్డు పరీక్షా కంట్రోలర్ సన్యామ్ భరధ్వాజ్ ప్రకటించారు.
లోక్‌సభలో ప్రస్తావించిన కాంగ్రెస్
సీబీఎస్‌ఈ పరీక్షా పత్రంలోని వ్యాసం అసంబద్ధం, స్త్రీ ద్వేషపూర్వకమని కాంగెస్ర్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. చదువు, పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలు నాసిరకంగా మారాయని ఈ వ్యాసం నిరూపిస్తోందన్నారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించి పభ్రుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షలో స్త్రీద్వేష పూర్వక వ్యాసం ప్రత్యక్షమవడమై తీసుకున్న చర్యలకు సంబంధించి ఈనెల 17లోగా నివేదిక ఇవ్వాలని సీబీఎస్‌ఈకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment