
సాక్షి,చండీగఢ్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఉద్యమంలో భాగంగా నిర్వహించ తలపెట్టిన ఒక సమావేశంలో షాకింగ్ ఘటన ఆందోళన రేపింది. హరియాణాలో జింద్‌లో ఏర్పాటు చేసిన రైతుల "మహాపంచాయతీ" భారీ సమావేశం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వేదికపైనే ఉన్న కీలక రైతు నేతలు, ఇతరులు కూడా స్టేజ్‌మీదినుంచి కిందికి పడిపోయారు. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. (రైతులతోనే యుద్ధమా? వైరలవుతున్న ఫోటోలు)
భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ సభను ఉద్దేశించి ప్రసంగించబోతున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. వేదిక కూలిపోతున్న సమయంలో రాకేశ్‌తో పాటు ఇతర రైతు నాయకులు కిందికి పడిపోవడం వీడియోలో రికార్డయింది. మరోవైపు గత రెండురోజులుగా రాజ్యసభలో నెలకొన్న గందరగోళం మధ్య రైతు డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య బుధవారం ఏకాభిప్రాయం కుదిరింది. ఈ అంశంపై కనీసం 5 గంటల పాటు సభలో ఏకధాటిగా చర్చ జరగాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరిస్తుందని దీనిపై 15 గంటల పాటు చర్చిద్దామంటూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోష ప్రకటించారు. దీనికి కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.
కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసేవరకు తాము తిరిగి వెళ్లబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. మరోవైపు రిపబ్లిక్ డే రోజున రైతు నిరసనలో చెలరేగిన హింస నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. రైతులను నిలువరించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో బారికేడ్ల ఏర్పాటు తోపాటు ఇతర కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment