భరణం సహేతుకంగా ఉండాలి: సుప్రీం
చట్టాలను దుర్వినియోగం చేయొద్దు
న్యూఢిల్లీ: మహిళల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలను భర్తలపై వేధింపులకు, దోపిడీకి సాధనాలుగా దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘భరణం మహిళకు సహేతుకమైన జీవన ప్రమాణాలను అందించడానికి ఉద్దేశించింది. అంతే తప్ప మాజీ జీవిత భాగస్వామితో సమానమైన ఆర్థిక స్థితిని కల్పించడానికి కాదు’’ అని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. ఒక మహిళ దాఖలు చేసుకున్న విడాకుల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు రూ.5,000 కోట్ల నికర ఆస్తులున్నాయని, మొదటి భార్యకు ఏకంగా రూ.500 కోట్ల భరణం చెల్లించాడని ఆమె పేర్కొంది. తనకూ భారీగా భరణం ఇప్పించాలని కోరింది. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ‘‘మాజీ భార్యకు తన ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారంగా నిరవధికంగా మద్దతివ్వాల్సిన అవసరం పురుషునికి లేదు. వివాహం కుటుంబానికి పునాది మాత్రమే తప్ప కమర్షియల్ వెంచర్ కాదు. మహిళలు తమ మేలు కోసం కోరే చట్టాలను జాగ్రత్తగా ఉపయోగించాలి’’ అని సూచించింది. వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్‌కు శాశ్వత భరణం కింద నెల రోజుల్లో రూ.12 కోట్లు చెల్లించాలని మాజీ భర్తకు ఆదేశించింది. అతనిపై దాఖలు చేసిన క్రిమినల్ కేసులను కొట్టేసింది. ‘‘విడాకుల కేసుల్లో భార్యలు తమ జీవిత భాగస్వామి ఆస్తులు, హోదా, ఆదాయాలను హైలైట్ చేయడం, వాటిలో సమాన వాటా కోరడం బాగా పెరుగుతోంది. ఇది సమర్థనీయం కాదు. భరణం విషయంలో భర్త ఆదాయాన్ని మాత్రమే కాకుండా, భార్య ఆదాయం, అవసరాలు తదితర అంశాలెన్నింటినో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విడాకుల తర్వాత దురదృష్టం కొద్దీ భర్త నిరుపేదగా మారితే? అప్పుడు తామిద్దరి సంపదను సమానం చేసుకోవడానికి సిద్ధపడుతుందా?’’ అని ప్రశ్నించింది. భార్య, ఆమె కుటుంబ సభ్యులు క్రిమినల్ చట్టాలను బేరసారాల సాధనంగా దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment