ఫైళ్లపై సంతకానికి ఇబ్బందేమిటి?
ఖైదీల ముందస్తు విడుదలలో నిర్ణయాల ఆలస్యంపై సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది.
ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది.
ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment