ఈ చెత్తనంతా భరించలేం: సుప్రీంకోర్టు | Supreme Court Says This Is Total Nonsense Will Punish IIT Bombay | Sakshi
Sakshi News home page

ఐఐటీ బాంబేపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Published Thu, Jul 30 2020 8:36 AM | Last Updated on Thu, Jul 30 2020 10:53 AM

Supreme Court Says This Is Total Nonsense Will Punish IIT Bombay - Sakshi

న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో ‘స్మోగ్‌ టవర్‌’నిర్మిస్తామన్న ఒప్పందం నుంచి వైదొలగడాన్ని తప్పుబట్టింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడిందని మండిపడింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశం పట్ల బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా న్యూఢిల్లీలో వాయు కాలుష‍్య స్థాయిని తగ్గించేందుకు స్మోగ్‌ టవర్‌(వాతావరణంలోని కాలుష్య కణాల్ని పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని విడుదల చేసేవి) ఏర్పాటు చేయాల్సిందిగా గతేడాది డిసెంబరులో సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బిజినెస్‌, ఫినాన్షియల్‌ హబ్‌గా పేరొందిన కనాట్‌ ప్లేస్‌లో మూడు నెలల్లోగా ఈ నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వాలు తమకు కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా కోరాయి.(‘దిశ’ ఘటన ఎన్‌కౌంటర్‌ విచారణ గడువు పొడిగింపు )

ఈ క్రమంలో స్మోగ్‌ టవర్‌ నిర్మాణానికై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ), ఐఐటీ బాంబే, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ అధికారుల మధ్య జనవరిలో ఒప్పందం కుదిరింది. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తికాలేదు సరికదా.. ఎంఓయూలో ఉన్న షరతులను తాము ఆమోదించలేమంటూ ఐఐటీ బాంబే జూలై 14న ఇ- మెయిల్‌ ద్వారా స్పష్టం చేసింది. సీపీసీబీ, టాటా ప్రతినిధులతో సమావేశం జరిగిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సుప్రీంకోర్టు ఉన్నత విద్యా సంస్థ తీరుపై మండిపడింది. ఈ చెత్తనంతా భరించడం తన వల్ల కాదంటూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు.(ఆర్మీలో మహిళా అధికారుల శాశ్వత కమిషన్‌). 

15 నిమిషాల్లో వాళ్లిక్కడ ఉండాలి
‘‘కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేస్తున్న ఐఐటీ బాంబేపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆరు నెలల తర్వాత ఇలా ఎలా వెనక్కి వెళ్తారు? ప్రభుత్వ ప్రాజెక్టు నుంచి ఎలా వైదొలగుతారు? కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాల్సిందే’ ’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక 30 నిమిషాల్లో ఐఐటీ బాంబే అధికారులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టాల్సిందిగా సాలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు. ఇందుకు స్పందించిన మెహతా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడ ఎవరైనా ఉన్నారో లేదో కూడా తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీంతో మరోసారి అసహనానికి గురైన జస్టిస్‌ మిశ్రా.. ‘‘నాన్‌సెన్స్‌. మరో 15 నిమిషాల్లో వాళ్లిక్కడ ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో.. ‘‘15 నిమిషాల్లో ఏమీ చేయలేను. నాకు 24 గంటలు ఇవ్వండి. ఒక్కరోజులో ఏమీ మారిపోదు కదా. నా పరిస్థితిని అర్థం చేసుకోండి’’అని న్యాయమూర్తికి విన్నవించారు. అయితే జస్టిస్‌ మిశ్రా మాత్రం మరోసారి ఐఐటీ బాంబే తీరును తప్పుబట్టారు. ‘‘ఆ సంస్థను కాపాడేందుకు ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు, వాళ్లు ఇప్పటికే కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన అంశంలో ఇంత నిర్లక్ష్యమా? షాకింగ్‌గా ఉంది. ప్రభుత్వ తీరుతో మేమెంత మాత్రం సంతోషంగా లేము. ఇప్పటికైనా సమాధానం చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని మండిపడ్డారు. కాగా ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 18.52 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement