న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో డీఎంకే ముఖ్య నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు చురకంటించింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో ఫైల్ అయిన కేసులన్నింటిని జత చేసి తమిళనాడులో విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
‘వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులతో మీరు పోల్చుకోవద్దు. వాళ్లు రేటింగ్‌ల కోసం వారి బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీరు మాత్రం ఎవరి జోక్యం లేకుండా సొంతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు’ అని ఉదయనిధికి కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉదయనిధి న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకుని ఇలాంటి వ్యాఖ్యలే నుపుర్ షర్మ అనే రాజకీయ నాయకురాలు చేస్తే ఆమె ఎఫ్‌ఐఆర్‌లన్నింటిని సొంత రాష్ట్రానికి బదిలీ చేశారని గుర్తు చేశారు.
దీనికి స్పందించిన అత్యున్నత న్యాయస్థానం అయితే మీరు సీఆర్పీసీ సెక్షన్ 406 కింద పిటిషన్ వేయకుండా ఆర్టికల్ 36 ప్రకారం రిలీఫ్ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. ఈ కేసు విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూ లాంటి రోగం అని గత ఏడాది చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లో స్టాలిన్‌పై కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment