అహ్మదాబాద్: గుజరాత్‌లో 2002 గోద్రా ఘటన అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాద్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వెంటనే లొంగిపోవాలని ఆమెను ఆదేశిస్తూ శనివారం గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వారం రోజులపాటు స్టే విధించింది. తొలుత తీస్తా షెతల్వాద్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
అల్లర్ల కేసుల్లో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారంటూ నమోదైన కేసుపై శనివారం జస్టిస్ నిర్జర్ దేశాయ్ విచారణ జరిపారు. ఈ కేసులో తనకు సాధారణ బెయిల్ మంజూరు చేయాలని విన్నవిస్తూ షెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై 30 రోజుల పాటు స్టే ఇవ్వాలన్న షెతల్వాద్ తరఫు లాయర్ అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు.
దీంతో ఆమె వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గుజరాత్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మొదట ద్విసభ్య వెకేషన్ ధర్మాసనం విచారణ జరిపింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. షెతల్వాద్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ బీఆర్ గావై, జసిŠట్‌స్ ఏఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం రాత్రి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆమె విజ్ఞప్తిని అంగీకరిస్తూ హైకోర్టు ఉత్తర్వుపై వారం రోజులపాటు స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment