సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫైల్ ఫొటో)
ముంబై: బాలీవుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో నిందితుడు, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి సహాయకుడు దీపేశ్ సావంత్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. తనను అక్రమంగా నిర్బందించారని, ఇందుకు పరిహారంగా రూ. 10 లక్షలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేసిన 36 గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించాడు. సెప్టెంబరు 5 రాత్రి ఎనిమిది గంటల సమయంలో తనను అరెస్టు చేసినట్లు ఎన్‌సీబీ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారని, నిజానికి తనను అంతకుముందు రోజు రాత్రి పదింటికి అరెస్టు చేసినట్లు పేర్కొన్నాడు.(చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్)
సెప్టెంబరు 6న తనను మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారని, తద్వారా సుప్రీంకోర్టు నిబంధనల(నిందితుడిని 24 గంటల్లో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టాలి)ను తుంగలో తొక్కారంటూ దీపక్ సావంత్ ఆరోపణలు చేశాడు. కాగా ఈనెల 5వ తేదీన దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణను నవంబరు 6కు వాయిదా వేశారు. జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కార్ణిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. ఇక సుశాంత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో అతడి ప్రేయసి రియా చక్రవర్తితో పాటు దీపక్ సావంత్ సహా పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. దీపక్ సావంత్‌కు ఇటీవల బెయిలు మంజూరైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment