సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్నాడీఎంకే శిబిరాల్లో నెలకొంది. బంతిని తమ వద్ద నుంచి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల్లో హడావుడి పెరిగింది. కాంగ్రెస్ డీఎండీకే అభ్యర్థి ఆనందన్ ఇప్పటికే నామినేషన్ వేశారు.
గురువారం నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి మేనకా నవనీతన్‌తో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్, కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమాయ్యరు. అలాగే అన్నాడీఎంకేలో పళణిస్వామి, పన్నీరు సెల్వం శిబిరాల మధ్య వార్ ఆ పార్టీ కేడర్‌ను నిరుత్సాహంలోకి నెట్టింది. పళని శిబిరం అభ్యర్థిగా తెన్నరసు, పన్నీరు శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ పేరు ఖరారు చేసినా రెండాకుల చిహ్నం ఎవరికి చిక్కేనో అన్న ఉత్కంఠతో రోజురోజుకూ తీవ్రమవుతోంది.
శివకుమార్ కోర్టులోకి బంతి..
రెండాకుల గుర్తు తమకే అప్పగించే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఇప్పటికే పళనిస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం గురువారం అప్పీలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఈ సమయంలో తమ కోర్టులో ఉన్న బంతిని ఈరోడ్ ఎన్నికల అధికారి శివకుమార్ కోర్టులోకి నెట్టే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టుకు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన నివేదికలో ఆ గుర్తు కోసం తమను ఎవరు సంప్రదించలేదని పేర్కొనడం గమనార్హం.
అలాగే చిహ్నం కేటాయింపుల వ్యవహారంలో తుది నిర్ణయం ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి చేతిలోనే ఉందని ఆ నివేదికలో పొందు పరిచి ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం సుప్రీం కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరించనున్నదో అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. దీంతో ఆ రెండు శిబిరాల అభ్యర్థులు రెండాకుల కోసం ఎదురు చూస్తూ నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. 7వ తేదీ వరకు సమయం ఉండడంతో ఇరు వర్గాలు ధీమాగా ఉన్నాయి. అదే సమయంలో పళని శిబిరం నేత తంబిదురై గురువారం ప్రధాని నరేంద్రమోదీని కలిసినట్టు సమాచారం వెలువడడం గమనార్హం.
పోస్టర్ టెన్షన్..
పళని స్వామి శిబిరం బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత వరకు ఆ పార్టీ తమ నిర్ణయాన్ని స్పష్టం చేయకపోవడంతో ఆయన మద్దతుదారులు కేంద్రంపై కన్నెర్ర చేశాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) కూటమిలో ముర్పొక్కు( ముందుస్తు ప్రణాళిక) అన్న పదాన్ని చేర్చడం చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటాన్ని కూడా ఆ కూటమి పేరులో తొలగించారు. నేషనల్ డెమోక్రటిక్ ముర్పొక్కు అలయన్స్ (ఎన్‌డీఎంఏ) అన్న పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం బీజేపీ వర్గాలను షాక్‌కు గురి చేశాయి.
ఈ సమాచారంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామితో మాట్లాడినట్లు సమాచారం. ఆ తర్వాత ఆగమేఘాలపై ముర్పొక్కు అన్న పదాన్ని తొలగించడం గమనార్హం. ఈ విషయంగా అన్నాడీఎంకే నేత జయకుమార్‌ను ప్రశ్నించగా, ఈరోడ్‌లో ఏర్పాటు చేసినట్లుందని దాట వేశారు. అయితే, ఈరోడ్ నియోజకవర్గంలో ఒక్కో బూత్‌కు 5 నుంచి 10 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 30 వేల మంది ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఓటర్ల జాబితాను పరిశీలించి, నకిలీ ఓటర్ల భరతం పట్టాలని ఎస్‌ఈసీ సత్యబ్రత సాహూకు విజ్ఞప్తి చేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment