ప్రమాదాల బారిన పడి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించి, రక్షించే ప్రత్యేక వైద్య పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆది పరాశక్తి అమ్మవారు కొలువైన మేల్ మరువత్తూరు వేదికగా ఈ పథకానికి శనివారం సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. దయ చేసి వాహన వేగాన్ని తగ్గించుకుని, మనల్ని మనం రక్షించుకుందామని, ఇతరుల ప్రాణాల్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం బృహత్తర వైద్య పథకాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే కాకుండా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు ప్రత్యేక వైద్యపథకంపై సీఎం స్టాలిన్ దృష్టి పెట్టారు. ఆ మేరకు ‘ఇన్నుయిర్ కాప్పోం’– 48 ( ప్రాణాలను కాపాడుదాం – 48 గంటల్లో) పేరుతో రూపొందించిన ఈ పథకం రాష్ట్రంలోని 610 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అమల్లోకి వచ్చింది.
48 గంటలు ఉచిత సేవ
మేల్ మరువత్తూరులో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామ, పట్టణ, నగర, జాతీయ రహదారుల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా సకాలంలో బాధితులకు వైద్య సేవలు అందేవిధంగా ఆస్పత్రుల్ని ఎంపిక చేశామని వివరించారు. మనల్ని మనం రక్షించుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలను కాపాడాలన్న సంకల్పంతోనే ఈ పథకానికి ఇన్నుయిర్ కాప్సోం –48 అని నామకరణం చేశామన్నారు. ఆస్పత్రిలో చేరిన 48 గంటల పాటుగా క్షతగ్రాతులకు ఉచితంగా వైద్యసేవలు అందుతాయని, ఆ తదుపరి సీఎం బీమా పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు. ప్రమాదానికి గురైన వారు తమిళనాడు వాసులే కానక్కర్లేదని, ఇతర రాష్ట్ర వాసులైనా, దేశాలకు చెందిన వారైనా సరే అందరికీ సమానంగా ఈ పథకం వర్తిస్తుందని వివరించారు.
చదవండి: (ఓబీసీ రిజర్వేషన్ రద్దు.. ఓటు అడిగేందుకు రావద్దు..)
ప్రమాదంలో గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రులకు తరలించే వారికి ప్రోత్సాహక నగదుగా రూ. 5 వేలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. అత్యవసర కాలంలో ప్రతిఒక్కరూ స్పందించాలని, ప్రాణాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు. దయచేసి రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి వాహనాల్ని నడపాలని, అతివేగాన్ని వీడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రమాద రహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుదామని, నిబంధనల్ని అనుసరిస్తామని ప్రతిఒక్కరూ ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు ఎం. సుబ్రమణియన్, కేఎన్ నెహ్రు, ఏవీ వేలు, తాము అన్భరసన్, ఎంపీ సెల్వం, ఎమెల్యేలు కరుణానిధి, ఎస్‌ఆర్ రాజ, అరవింద్ రమేష్ పాల్గొన్నారు.
చదవండి: (పంజాబ్‌లో అమరీందర్‌తో కాషాయదళం పొత్తు)
టీకా శిబిరం పరిశీలన
కరోనా వ్యాక్సిన్ శిబిరం శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో జరిగాయి. పెద్దఎత్తున జనం ఉదయాన్నే శిబిరాల వద్ద బారులు తీరారు. రెండో డోస్ టీకాను అత్యధిక శాతం మంది వేయించుకున్నారు. గూడువాంజేరిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని సీఎం స్టాలిన్ పరిశీలించారు. టీకా వేయించుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment