చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రి స్పష్టం చేసింది. గవర్నర్‌ను హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంచి కొంతమంది డాక్టర్లతో కూడిన బృందం పర్యవేక్షించనుంది. భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే కావేరి ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కావేరి ఆస్పత్రి అధికారి ఒకరు తెలిపారు. (ఏపీ రాజ్‌భవన్‌లో రక్షాబంధన్ వేడుకలు రద్దు)
జూలై 29వ తేదీన తమిళనాడు రాజ్‌భవన్ సిబ్బందిలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.తాజాగా ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాజ్‌భవన్‌లో మరోసారి అలజడి రేగింది. అంతకుముందు 84 మంది రాజ్‌భవన్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది ఉద్యోగులు, సెక్యూరిటీ, ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లకు చెందిన వారే ఉన్నారు. ఆ క్రమంలోనే రాజ్‌భవన్ ప్రధాన బిల్డింగ్‌లో ఎవరూ కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అదే సమయంలో గవర్నర్‌తో కూడా ఎవరూ కూడా కాంటాక్ట్ కాలేదని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. కాగా, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో వివిధ ఆంక్షలతో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారికి ఈ-పాస్ లేనిదే అనుమతించమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment