సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరిగేనా..? అన్న టెన్షన్ తప్పడం లేదు. విదేశాల నుంచి వచ్చిన 82 మందిలో ఆ వైరస్ ఛాయలు ఉండటంతో శాంపిల్స్‌ను పరిశోధనకు పంపించారు. ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, నైజీరియా నుంచి వచ్చిన రోగి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్య వర్గాలు ప్రకటించాయి. ఇక శాంపిల్స్‌ను పరిశోధన నిమిత్తం బెంగళూరుకు పంపించారు. ఇందులో కొందరికి ఒమిక్రాన్ వైరస్ సోకి ఉండే అవకాశంతో కింగ్స్ ఆసుపత్రి వైద్య పర్యవేక్షలో ఉంచారు. వీరి పరిశోధన ఫలితం గురువారం ఉదయం అందే అవకాశం ఉంది. దీంతో వైరస్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో బుధవారం టాంజానియా నుంచి నెల్లైకు వచ్చిన యువకుడిలోనూ ఒమిక్రాన్ ఛాయలు వెలుగు చూశాయి. ఇక, కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వెళ్లిన 39 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి వైద్య వర్గాలకు సమాచారం అందించారు.
సరిహద్దుల్లో అలర్ట్
ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు, మరోవైపు కేరళలో ఏకంగా మొత్తం 24 మంది ఒమిక్రాన్ బారిన పడడంతో తమిళనాడు సరిహదుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని పరిశోధించి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో అదనంగా వైద్య బృందాల్ని నియమించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, జిల్లాల కలెక్టర్లను మరింత అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ మరో సారి హెచ్చరించడం గమనార్హం.
కోలుకుంటున్న రోగి
నైజీరియా నుంచి వచ్చి ఒమిక్రాన్ బారిన పడ్డ రోగికి కింగ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించడంతో కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. బుధవారం కీల్పాకం ఆస్పత్రిలో వైద్య సేవల వివరాల్ని పేర్కొంటూ, డిజిటల్ బోర్డుల్ని ఏర్పాటు చేశారు. ఇదే తరహా బోర్డులో 25 ఆస్పత్రుల్లో వారం రోజుల్లో ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. అలాగే, కొత్తగా ఏర్పాటు అవుతున్న ఆస్పత్రుల్లోనూ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒమిక్రాన్ ఛాయలకు సంబంధించి కొందరికి చికిత్సలు అందిస్తున్నామని, వారి పరిశోధన నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment