
చెన్నై: ‘‘అదంతా అకస్మాత్తుగా జరిగిపోయింది. అసలు మేం ఊహించలేదు. ప్రధాని మోదీ చాలా బాగా మాట్లాడారు. నన్ను మాట్లాడేలా ప్రోత్సహించారు. ఆయన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. కష్టపడి చదివి ప్రతిష్టాత్మక కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదిస్తాను. న్యూరో సర్జన్ కావాలన్నదే నా ఆశయం’’ అని తమిళనాడుకు చెందిన కనిగ తన భవిష్యత్ ప్రణాళికల గురించి వెల్లడించారు. స్వయంగా దేశ ప్రధాని తనకు కాల్ చేసి మాట్లాడతారని, ఊహించలేదని.. ఆశ్చర్యానికి లోనయ్యానంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన కనిగ ఇటీవల వెల్లడైన క్లాస్ 12 పరీక్షా ఫలితాల్లో 500 మార్కులకు గానూ 490 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. (ఆ సాహసం.. సదా స్మరణీయం)
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు కాల్ చేసి మాట్లాడారు. సాధారణ కుటుంబానికి చెందిన కనిక కథ ఎంతో స్పూర్తిదాయకమన్న ఆయన.. ‘‘వనక్కం కనికా జీ, ఎలా ఉన్నారు’’అంటూ ఆమెను పలకరించారు. ‘‘మీరు సాధించిన విజయానికి అభినందనలు. నమక్కల్ గురించి విన్నపుడు ఆంజనేయ స్వామి గుడి గుర్తుకు వచ్చేది. ఇప్పటి నుంచి మీతో ఈ సంభాషణ గుర్తుకు వస్తుంది. మీ ఫేవరెట్ సబ్జెక్టు ఏంటి? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?’’ అని అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణకు సంబంధించిన ఆడియోను ట్విటర్‌లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. కనిగ, ఆమె సోదరి లాంటి యువతులు నవ భారతాన్ని ఆవిష్కరిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.(అందుకే 100 శాతం మార్కులు: దివ్యాన్షి)
ఈ విషయం గురించి కనిగ కుటుంబ సభ్యులు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ కాల్ తమకు జీవితకాలపు సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమన్న కనిగ.. ప్రస్తుతం తాను నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. తన సోదరి ట్రిచీలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు వెల్లడించారు. కాగా కనిగ తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ తమ కూతుళ్లు సాధిస్తున్న విజయాలు చూసి ఆ బాధలన్నీ మరచిపోగలుగుతున్నామని, వారిని చూస్తే గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ కాల్ తర్వాత కనిగ ఇంటికి చేరుకున్న బీజేపీ యువజన విభాగం సభ్యులు ఆమెకు శాలువా కప్పి సన్మానం చేశారు.
Youngsters like Kaniga and her sister personify the spirit of New India, where success is not merely determined by the family one is born in, the school/ college one studied, the big city one lives in.
— Narendra Modi (@narendramodi) July 26, 2020
Hardwork and perseverance gives results. India is changing. #MannKiBaat pic.twitter.com/orEEFzPdfA