చెన్నై: రాముడు ఉత్తరభారతానికే దేవుడు అన్న భావనను తమిళనాడు ప్రజల్లో కల్పించారని రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి అన్నారు. దీంతో తమిళనాడు ప్రజలకు రాముడి గురించి పెద్దగా తెలియదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు యువతకు భారత సంస్కృతి తెలియకుండా చేశారని ఆరోపించారు.
‘నిజానికి రాముడు తమిళనాడులో తిరగని చోటు లేదు. కానీ ఇక్కడి వారికి రాముడంటే తెలియదు. రాముడు ఉత్తర భారతానికి చెందిన దేవుడన్న భావనను ప్రజల మనసుల్లోకి జొప్పించారు. రాష్ట్ర యువతకు భారత సంస్కృతి తెలియకుండా ఉండేందుకు సాంస్కృతిక హననం చేశారు’అని రవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ తనయుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా రవి ఈ సందర్భంగా స్పందించారు.‘కొందరు గతంలో సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియా వైరస్‌లతో పోల్చారు. వారికేమైందో తెలియదు కానీ ఆ అంశంపై ఇప్పుడేం మాట్లాడడం లేదు. ఒక్కసారిగా మూగబోయారు’అని ఉదయనిధిని రవి పరోక్షంగా ఎద్దేవా చేశారు.
కాగా, తమిళనాడులో డీంఎకే ప్రభుత్వానికి, గవర్నర్ రవికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడులో ప్రభుత్వ స్కూళ్లలో విద్యా నాణ్యత అసలే లేదని, విద్యార్థులు కనీసం రెండంకెల సంఖ్యను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారని గవర్నర్ విమర్శించారు. అయితే కేంద్రంలోని బీజేపీ గవర్నర్ ద్వారా తమ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చూస్తోందని డీఎంకే ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి.. జ్ఞానవాపి విశ్వనాథ గుడిని మసీదు అనడం దురదృష్టకరం: యోగి ఆదిత్యనాథ్
Comments
Please login to add a commentAdd a comment