ప్రచారం జోరు పెంచిన బీజేపీ నేతలు
అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న కమలదళం
సాక్షి, న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం దక్కించుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రచారం కోసం తెలుగు నేతలంతా హస్తినలోనే మకాం వేశారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం కమలం నేతలు తమవంతు కృషిచేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా తెలుగు ప్రజల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ ప్రచారం జోరు మరింత పెరగనున్నది.
ఒక్కొక్కరికి ఒక నియోజకవర్గం
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా బీజేపీకి ప్రణాళిక రచించింది. ఒక్కో నేతకు ఒక్కో మండలం బాధ్యతలు అప్పగించింది. తెలంగాణకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు తెలుగు ఓటర్లు ఎక్కువగావున్న నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు కరోల్‌బాగ్‌లో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరి్వంద్‌కు ఆర్కేపురం, జంగ్‌పురా నియోజకవర్గాలను కేటాయించగా అక్కడ ఆయన గత 15 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. కేంద్ర మంత్రి, తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఆదివారం నుంచి పూరి్థస్థాయిలో బీజేపీ నేతలు రంగంలోకి దిగనున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం ఘోండా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ప్రచారం చేశారు.
ఏపీ నేతలకు వ్యూహాత్మకంగా బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో గత వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగ్‌పురి నియోజకవర్గంలో శుక్రవారం ప్రచారం చేశారు. ఈ ప్రాంతంలో తెలుగు ప్రజలను కలిసి బీజేపీ అభ్యర్థి కోసం ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థ సార«థికి మటియా మహల్ నియోజకర్గం బాధ్యతలు అప్పగించారు. అదోనిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. వారి ప్రభావంతో పార్థసారథి విజయం సాధించారని భావించిన అధిష్టానం ఆయనకు మటియా మహల్ ప్రాంతం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. ఆయన ఆదోనికి చెందిన ముస్లిం నేతలతో కలిసి బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగే బీజేపీ నేతలు విష్ణువర్థన్‌రెడ్డి, మాధవ్ తదితరులు కూడా బీజేపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయనున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment