శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో గురువారం బీజేపీ నేత ఇంటిపై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు సహా ముగ్గురు ముష్కరులు భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. శుక్రవారం వేకువజామున భద్రతా బలగాలు కాకపొరా ప్రాంతంలోని ఘాట్‌మొహల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. అదే సమయంలో వారికి తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వారికి బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో ఇద్దరు నౌగామ్‌లో బీజేపీ నేత అన్వర్ అహ్మద్ నివాసంపై గురువారం దాడికి యత్నించిన వారేనని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
దాడి ఘటనలో లష్కరే తోయిబా, అల్ బద్ర్ సంస్థలకు చెందిన నలుగురితో కూడిన బృందం పాల్గొందని ఆయన వివరించారు. బీజేపీ నేత ఇంటి వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రమీజ్ రజా అనే కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. రమీజ్ నుంచి వారు తీసుకెళ్లిన ఎస్‌ఎల్‌ఆర్‌తోపాటు ఏకే–47 రైఫిల్, పిస్టల్ వారి వద్ద లభ్యమయ్యాయని ఐజీపీ విజయ్ తెలిపారు. ‘ఘాట్ మొహల్లాలో సోదాలు చేపట్టాం. లొంగిపోవాలని కోరినా ఉగ్రవాదులు లెక్కచేయకుండా ఐదుగురు పౌరులను బందీలుగా ఉంచుకున్నారు. దీంతో, బలగాలు ముందుగా పౌరులను బయటకు తీసుకువచ్చాయి. అనంతరం ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అందుకే, ఈ ఆపరేషన్ పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టింది’అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment