లక్ష్మణ్, అన్బరసి పెళ్లి ఫొటో
తిరువళ్లూరు (చెన్నై): ఫేస్‌బుక్‌లో పరిచయమైన దాదాపు రెండేళ్ల ప్రేమ వ్యవహరాన్ని నడిపి కులాంతర వివాహం చేసుకున్న యువతిని అత్తారింటి వాళ్లు గెంటేయడంతో న్యాయం చేయాలని బాధిత యువతి ఎస్పీ పకెర్లా సెఫాస్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం యూనియన్ విరయూర్ గ్రామానికి చెందిన అంథోనిరాజ్ కుమార్తె అన్బరసి(25). ఇంజినీరింగ్ పూర్తి చేసి పెరంబలూరులోని ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పని చేసేది.
2018లో ఫేస్‌బుక్ ద్వారా తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడు యూనియన్ చిన్నకలకాటూరు గ్రామానికి చెందిన జయరామన్ కుమారుడు లక్ష్మణన్ పరిచయమయ్యాడు. రెండేళ్ల ప్రేమించుకున్న అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి మార్చి13, 2020న తిరువళాంగాడులోని ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. వీరికి ప్రస్తుతం రష్మిక(01) అనే కూతురు వుంది. వివాహం సమయంలో రూ.1.30 లక్షల నగదు, పది సవర్ల బంగారు నగలు కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వివాహమైన కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కుటుంబంలో కులాంతర చిచ్చు రేగింది.
వినతిపత్రం చూపుతున్న అన్బరసి
అన్బరసి దళిత కులానికి చెందిన యువతి కావడంతో ఆమెకు ప్రత్యేక గ్లాస్, ప్లేటును ఇచ్చి ప్రత్యేక గదిలో ఉంచి వేధింపులకు గురి చేశారు. తరచూ కులం పేరుతూ దూషిస్తుండడంతో ఆరు నెలల క్రితం బాధితురాలు తిరుత్తణి మహిళ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి జీవించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అన్బరసిపై లక్ష్మణ్ కుటుంబ సభ్యులు మరో సారి దాడికి దిగారు. దీంతో బాధితురాలు మంగళవారం ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.
తనను, కూతురిని కులం పేరుతో దూషిస్తున్నారని, తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, భర్త లక్ష్మణ్, అత్త దేవకితో పాటు మరో ఐదు మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేసిన వీడియోను సైతం ఎస్పీకి అందించింది. ఈ సంఘటనపై స్పందించి తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి పోలీసులను ఎస్పీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment