ముంబై: ప్రముఖ నగరాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్, ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని, హస్పిటల్స్, తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందిన విషయం తెలిసిందే.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. హోటల్ ఒట్టేరాతో సహా మరో రెండింటికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు ఆగ్నేయ డీసీపీ పేర్కొన్నారు. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్లు చెప్పారు.
బెదిరింపు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కాగా బుధవారమే దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. అయితే అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేకపోవడంతో బెదిరింపు బూటకమని తేలింది. ఇక గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment