నరేశ్‌గుప్తా, యశోద, సుమన (ఫైల్)
సాక్షి, బెంగళూరు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన బెంగళూరు మహాలక్ష్మీ లేఔట్‌లో చోటుచేసుకుంది. యశోద (70), కుమార్తె సుమన (41) కుమారుడు నరేశ్‌గుప్తా (36) మృతులు. విషం తాగి ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానం ఉందని మంగళవారం ఉత్తరవిభాగ డీసీపీ వినాయకపాటిల్ తెలిపారు.
ఇంటి పెద్ద మరణంతో కుంగుబాటు
వివరాలు.. యశోదకు ముగ్గురు సంతానం. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లయి రాజాజీనగరలో ఉంటోంది. కుమారుడు నరేశ్‌గుప్తా కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. యశోద భర్త నాలుగునెలల క్రితం చనిపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. భర్త వినియోగిస్తున్న వస్తువులను అనాథ ఆశ్రమానికి అందజేసి ఆ ఇంటిని ఖాళీ చేసి మహాలక్ష్మీలేఔట్ ఆంజనేయ గుడి వద్ద అపార్టుమెంటులోని రెండో అంతస్తులో ఓ ఫ్లాటులోకి మారారు. ఇద్దరు పిల్లలతో కలిసి యశోద ఉంటున్నారు. కుమార్తె సుమనకు ఆరోగ్య సమస్య ఉండటంతో ఇంకా వివాహం కాలేదు. అంతేగాక నరేశ్‌గుప్తా కూడా అవివాహితుడు.
ఘటన జరిగిన అపార్టుమెంటు
ఫోన్ చేసినా స్పందన లేదని..
మంగళవారం యశోదకు బంధువులు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ తీయలేదు. కూతురు వచ్చి ఫ్లాట్ కాలింగ్‌బెల్ నొక్కినా స్పందన లేదు. ఆమె సెక్యూరిటీ గార్డుకు చెప్పగా, అతడు వచ్చి తలుపు తీసి చూడగా ముగ్గురూ మరణించి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాలను ఎంఎస్.రామయ్య ఆసుపత్రికి తరలించారు. రెండురోజుల క్రితం యశోద, సెక్యూరిటీగార్డును పిలిచి రెండురోజులు ఉండటం లేదు, పాలు, పేపరు మీరే తీసుకోండి అని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment