
‘రండి.. ఏకమవుదాం.. ఆ పార్టీకి వ్యతిరేకంగా జత కడుదాం
కోల్‌కత్తా: ‘రండి.. ఏకమవుదాం.. నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా జత కడుదాం’ అని బీజేపీయేతర పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలు ముగియగానే చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చారు. మొత్తం ఏడు ప్రధానాంశాలపై మమత లేఖ రాస్తూ వారికి పంపించారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మమతా పంపారు. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని మమతా గుర్తుచేశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే..
‘నేను మీకు లేఖ రాస్తున్నా. నా తీవ్రమైన ఆందోళనను మీతో పంచుకోవాలనుకుంటున్నా..’ అంటూ మమతా లేఖ మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దారుణంగా దాడి చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని లేఖలో మమత ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విధానాలు, నైతిక విలువలు బీజేపీకి వ్యతిరేకమని, అలాగే వదిలేస్తే దేశానికే ప్రమాదం అని గుర్తుచేశారు. ఆ పార్టీపై పోరాటానికి అన్ని పార్టీలు ఏకం కావాలని, అలాగైతేనే ఓడించగలమని మమత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీకి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును మమత ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం కాకుండా పూర్తిస్థాయి లెఫ్టినెంట్ ప్రభుత్వం నడిపించేలా కొత్త చట్టం తెస్తోందని ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. రెండుసార్లు కేజ్రీవాల్ ఓడించారని, మళ్లీ గెలిచే నమ్మకం లేకనే ఈ కొత్త తెస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి మున్సిపల్ స్థాయికి తీసుకొస్తోందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిణామాలతో బీజేపీ ఏక పార్టీ అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని మమత స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా ఇతర పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు.
మమత లేఖ పంపినది వీరికే..
శరద్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)
స్టాలిన్, ద్రవిడ మున్నేట కజగమ్ (డీఎంకే)
ఉద్దవ్ ఠాక్రే, శివసేన
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
నవీన్ పట్నాయక్, బిజూ జనతాదళ్ (బీజేడీ)
తేజస్వి యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)
అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)
అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ
చదవండి: ‘టార్చ్‌లైట్’ విసిరివేత: కోపమేలా కమల్ హాసన్