ఒడిశా:ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే.. ప్రమాదం జరిగిన కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో తెలిపే 'రైల్ ట్రాఫిక్ ఛార్ట్' ను రైల్వే ట్రాఫిక్ అధికారులు విడుదల చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.
ఈ చిత్రంలో పేర్కొన్న విధంగా మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి. అందులో 'అప్ మెయిన్'గా చూపే రైల్ మార్గంలో షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. దానికి కుడి వైపున ఉన్న 'డౌన్ మెయిన్'లో బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లింది.
'అప్ మెయిన్'లో వెళ్లే కోరమండల్ క్రాసింగ్ పాయింట్ ఉండటంతో పొరపాటున కామన్ లూప్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. దీంతో కోరమండల్‌లోని కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్కనే ఉన్న డౌన్ మెయిన్ లైన్‌లోకి ఎగిరిపడ్డాయి. అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు-హవ్‌డా ఎక్స్‌ప్రెస్ రైలు వాటిని ఢీ కొట్టింది. దీంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగింది. అయితే.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస‍్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:Odisha Train Accident: ఓ వైపు రైలు ప్రమాదం.. మరోవైపు.. బస్సు ఛార్జీల పెంపు..!
Comments
Please login to add a commentAdd a comment