కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
విచారణ అనంతరం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment