ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు అందరినీ బెంబెలెత్తిస్తున్నాయి. అయితే ఇటువంటి సందర్భాల్లో ఒక్కసారి ఆ రైలు నడుపుతున్న పైలట్లు తెగువ చూపి, ప్రమాదాన్ని నివారిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్‌లో చోటుచేసుకుంది.
బీహార్‌లోని సమస్తీపూర్‌లో రైలు ప్రమాదాన్ని నివారించిన లోకో పైలట్లను అందరూ మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే సమస్తీపూర్ రైల్వే సెక్షన్‌లోని వాల్మీకినగర్-పనియవా స్టేషన్ల మధ్యగల వంతెనపై రైలు ఉన్నట్టుండి ఆగిపోయింది. వంతెనపై రైలు అలా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే రైలులోని ఏదో వాల్వ్ నుంచి ఎయిర్ ప్రజర్ లీక్ అవడాన్ని లోకో పైలట్లు గమనించారు. అందుకే రైలు అలా ఆగిపోయిందని గుర్తించారు.
బయటి నుంచి సాంకేతిక సాయం అందించడానికి వీలులేని చోట రైలు ఆగింది. దీంతో రైలును నడుపుతున్న ఇద్దరు లోకో పైలట్‌లూ ఇంజిన్‌లోని లీకేజీని సరిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు రైలు కిందుగా పాకుకుంటూ లీకేజీ అవుతున్న చోటుకువెళ్లి మరమ్మతులు చేశారు.
ఈ ఘటన గురించి రైల్వే అధికారులు మాట్లాడుతూ నార్కతియాగంజ్ - గోరఖ్‌పూర్ ప్యాసింజర్ రైలు వాల్మీకినగర్- పనియావాన్ మధ్య గల వంతెనపైకి చేరుకోగానే ఇంజిన్ (లోకో)కు చెందిన అన్‌లోడర్ వాల్వ్ నుండి అకస్మాత్తుగా ఎయిర్ ప్రజర్ రావడం మొదలైంది. ఫలితంగా ఎంఆర్ ఒత్తిడి తగ్గింది. దీంతోట్రాక్షన్ ఆగిపోయి, రైలు వంతెనపై నిలిచిపోయింది. రైలు బ్రిడ్జి మధ్యలో ఆగడంతో దాన్ని సరిచేసే మార్గం కనిపించలేదు. అయితే రైలు నడుపుతున్న పైలట్లు ఎంతో తెగువ చూపి, దానికి మరమ్మతులు చేసి, రైలు ముందుకు కదిలేలా చేశారు.
ఈ సందర్భంగా సమస్తీపూర్ డీఆర్‌ఎం మాట్లాడుతూ లోకో పైలట్లు అజయ్ కుమార్ యాదవ్, జీత్ కుమార్ ఎంతో తెగువచూపి వంతెనపై ఆగిపోయిన రైలు ముందుకు కదిలేలా చేశారని, వీరికి రైల్వేశాఖ రూ.10 వేల నగదు అందించడంతోపాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment