అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అధికార బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపురలోని బెలోనియా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అరుణ్ చంద్ర భౌమిక్.. ఇటీవల తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎంసీ నాయకులు అగర్తలా ఎయిర్‌పోర్టులో కాలుపెడితే వారిపై తాలిబన్ల తరహాలో దాడి చేయాలని తన మద్దతుదారులను రెచ్చగొట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశాల మేరకు టీఎంసీ నాయకులు త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ ఒంట్లో చివరి రక్తపుబొట్టు ఉన్నంతవరకూ తాము బీజేపీ ప్రభుత్వాన్ని రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ నేతలు మండిపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే, త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్ట్‌ల పాలన తరువాత బిప్లవ్ దేవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తమ ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు టీఎంసీ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే తమ కార్యాచరణను మొదలుపెట్టాయి.
చదవండి: శక్తిమంతమైన 'జీరో రూపాయి నోట్' గురించి మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment