దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్‌కు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment